हिन्दी 日本語 Español English Русский Français Svenska Deutsch Italiano Norsk (Bokmål)
శబరిమల లేదా శబరిమలై, కేరళ రాష్ట్రంలోగల ఒక ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ కొలువైన దేవుడు అయ్యప్ప, హిందువులు ఈయనను హరిహరసుతుడిగా భావించి పూజిస్తారు. ఈ ప్రదేశం పశ్చిమ కనుమల్లో నెలకొని ఉంది. కేరళ లోని పత్తినంతిట్ట జిల్లాలో సహ్యాద్రి పర్వత శ్రేణుల ప్రాంతం క్రిందకు వస్తుంది. గుడి సముద్ర మట్టం నుంచి సుమారు 3000 అడుగుల ఎత్తులో దట్టమైన అడవులు, 18 కొండల మధ్య కేంద్రీకృతమై ఉంటుంది.
ఇక్కడికి యాత్రలు నవంబరు నెలలో ప్రారంభమై జనవరి నెలలో ముగుస్తాయి. ఇక్కడికి దక్షిణాది రాష్ట్రాల భక్తులే కాక ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు. మండల పూజ (నవంబరు 17), మకరవిళక్కు (జనవరి 14) ఈ యాత్రలో ప్రధాన ఘట్టాలు. జనవరి 14 వ రోజును ఆలయంలో మకర జ్యోతి దర్శన మిస్తుంది. మిగతా అన్ని రోజుల్లోనూ గుడిని మూసే ఉంచుతారు. కానీ ప్రతీ మలయాళ నెలలో ఐదు రోజుల పాటు తెరచియుంచుతారు.