ఆగ్రా (ఆంగ్లం : Agra) (హిందీ : आगरा, ఉర్దూ : آگرا ) నగరం ఉత్తరప్రదేశ్ లో, యమునా నది ఒడ్డున గలదు. మహాభారత కాలంలో దీని పేరు 'అగ్రబనా' లేదా స్వర్గం. టోలెమీ ప్రాచీన భౌగోళశాస్త్రజ్ఞుడు, తన ప్రపంచ పటంలో దీనిని ఆగ్రాగా గుర్తించాడు. ఈ నగరాన్ని నిర్మించిన వారి గురించి పలు కథనాలున్నాయి, కానీ ఎవరి ఆధీనంలో ఈ నగరముండినదో, ఈ విషయం మాత్రం చెప్పగలుగుతున్నారు. ఈ నగరం రాజా బాదల్ సింగ్ (1475) ఆధీనంలోనుండేది. పర్షియన్ కవి సల్మాన్ ప్రకారం రాజా జైపాల్ అనే రాజు ఆధీనంలో వుండేది, ఇతడికి మహమూద్ గజనీ నుండి సంక్రమించింది. 1506లో సికందర్ లోఢీ పాలించాడు, తరువాత ఇది, మొఘల్ చక్రవర్తుల ఆధీనంలోకి వచ్చింది. ఇందులోని తాజ్ మహల్, ఆగ్రా కోట, ఫతేపూర్ సిక్రీ మూడునూ యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా, గుర్తింపబడ్డాయి.