మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, మహానంది మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది మహానంది మండలానికి కేంద్రం.నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవ నందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవ నందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది.ఇది మహా శివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహా శివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది.ఈ పురాతన ఆలయం సా.శ. 7 శతాబ్దం నాటిది. 10వ శతాబ్దపు పలకల శాసనాలు ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మత్తులు జరిగినట్లుగా, పునర్నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి.